1. ఇన్ స్టంట్ కాఫీపొడి గడ్డకట్టకుండా ఉండాలంటే దానిని ఎయిర్ టైట్ డబ్బాలో ఉంచి డీప్ ఫ్రిజ్ లో ఉంచితే ఎంత కాలమైనా గడ్డకట్టకుండా ఉంటుంది.
2. వంటగదిలో చీమలు స్వైరవిహారం చేస్తున్నాయా? ఒక దోసకాయను ముక్కలుగా తరిగి చీమలు తిరిగే చోట ఉంచండి.
3. కూరగాయలు వడలిపోయాయా? నిమ్మరసం కలిపిన నీటిలో ఓ పది నిముషాలు ఉంచండి. తాజాగా అవుతాయి.
4. కూరల్లో మసాలా ఎక్కువైందా? రెండు మూడు టమాటాలను ఉడికించి అందులో కలపండి. మసాలా ఘాటు తగ్గి మంచి రుచిగా వుంటుంది.
5. చెక్కతో చేసిన చెంచాలు, గరిటెలు వాసన వేస్తుంటే వాటిని వెనిగర్ కలిపిన నీటిలో ఉంచండి. కొద్ది సేపైన తర్వాత వాడుకోండి. వాసన రావు.
6. వంట చేసేటప్పుడు చేతులు మరకలు అవుతున్నాయా? ఆలుగడ్డ (బంగాళా దుంప) ముక్కలతో రుద్ది కడుక్కోండి.
7. పెనం, మూకుడు వంటి వాటికి పదార్థాల మరకలు వదలకుంటే గిన్నెలు తోముకునే లిక్విడ్ కు కొంచెం వంటసోడా, కొన్ని నీళ్ళు కలిపి రుద్దండి.
8. అన్నం వంటేప్పుడు ముద్దగా అవుతున్నదా? ఉడికేప్పుడు చెంచా వంట నూనె వేస్తే పొడిపొడిగా వుంటుంది.
9. వడలు, గారెలు చేసేటప్పుడు నూనె చిల్లుతుందా? నూనెలో రెండు చెంచాల నెయ్యి కలపండి.
10. పెనానికి జిడ్డు బాగా పేరుకు పోయి ఎంతకూ వదలడం లేదా? పెనాన్ని వేడి నీళ్ళలో రెండు మూడు గంటలుంచి తర్వాత నిమ్మ చెక్కతో రుద్దండి.
11. మీరు పెట్టిన దోస ఆవకాయ బాగా ఘాటుగా ఉందా? అందులో కొంచెం నిమ్మ రసం పిండండి.
12. దోశలు మెత్తగా రావడం లేదా? బియ్యం రవ్వ/బొంబాయి రవ్వను కప్పు తీసుకుని జావకాచి చల్లార్చి దోశ పిండిలో కలపండి.
13. అల్లం వెల్లుల్లి ఎక్కువ కాలం నిలువ వుండటం లేదా? వాటిని కాగితం కవర్లో వేసి లేదా కాగితంతో పొట్లం కట్టి ఫ్రిజ్లో వుంచండి.
14. నిలువ పచ్చళ్ళు మీకు పడటం లేదా? సన్నగా తరిగిన క్యాలీఫ్లవర్, క్యారెట్ ముక్కల్ని ఉప్పు కలిపిన నిమ్మరసంలో నానబెట్టి, కావాలనుకున్నప్పుడు పెరుగన్నంతోబాటు తినండి.
15. పంచదార డబ్బాకు చీమలు పడుతున్నాయా? అందులో కొన్ని లవంగాలని వేయండి.
16. చేప ముక్కల్ని నిల్వచేయాలా? వాటికి కొద్దిగా ఉప్పు కలిపి డీప్ ఫ్రీజర్ లో ఉంచండి. ముక్కలు అంటుకోవు. ఐస్ పేరుకోదు.
17. వంటల్లో వేయటానికి మొక్కజొన్న పిండి అందుబాటులో లేకుంటే మైదా పిండి వేసుకోవచ్చు.
18. అల్యూమినియం గిన్నెలో వండేప్పుడు గిన్నె మాడుతున్నదా? ఉడికేప్పుడు చెంచా వెనిగర్ వేయండి.
19. గ్రేవీ, సూపులు చిక్కగా రావడం లేదా? అవి తయారు చేసేప్పుడు తగినంత మొక్కజొన్న పిండి కలపండి.
20. పాస్తా చేసేప్పుడు ఉప్పును ముందుగా వేయొద్దు. ఉడికిన తర్వాతనే వెయ్యాలి.
21. స్వీట్స్ చేసేప్పుడు చక్కెరకు బదులుగా దానిని పొడిచేసి వేస్తే అవి ఇంకా రుచిగా వుంటాయి.
22. లంచ్ బాక్స్ లు వాసన వేస్తున్నాయా? రెండు మూడు రోజులకొకసారి నిమ్మచెక్కతో రుద్ది కడగండి.
23. వాల్ నట్స్ ను రాత్రంతా ఉప్పునీటిలో నానబెట్టి ఉదయాన పెంకును సులువుగా తీయొచ్చు.
24. కూరగాయలు తరిగేప్పుడు చేయి కాలినా/తెగినా అలోవెరా జెల్ ను రాయండి.
25. కేక్ గుడ్డు వాసన వస్తూంటే… తయారు చేసేప్పుడు రెండు స్పూన్ల తేనె కలపండి.
26. చపాతీ నిల్వ చేసుకోవాలంటే వాటిని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి మధ్యలో ఆలుగడ్డ (బంగాళా దుంప) చెక్కు తీసి పెట్టండి. రెండు రోజులకోమారి ఆలుగడ్డను మారుస్తూ వుండండి.
27. ఫ్రూట్ సలాడ్ చాలా రోజుల వరకు నిలువ వుంచుకోవాలంటే దానిమీద అర కప్పు నిమ్మరసం చల్లండి. వాసన కూడా సూపర్ గా వుంటుంది.
28. ఆలుగడ్డ (బంగాళాదుంప) ని వేయించే ముందు ముక్కలను మజ్జిగలో పది నిముషాలు ఉంచండి. చక్కగా వేగుతాయి. రుచిగా ఉంటాయి.
29. కాకరకాయలు ఫ్రిజ్ లో వుంచినా పండి పోతున్నాయా? వాటిని వీలైనంత చిన్నవిగా విరిచి నిలువ చేయండి. ఎక్కువ రోజులు నిలువ వుంటాయి.
30. డ్రై ఫ్రూట్స్ తో స్వీట్లు చేయాలనుకొన్నప్పుడు కాసేపు వాటిని ఫ్రిజ్ లో ఉంచి తీసి, కొద్దిగా వేడి చేసిన కత్తితో కోయండి. సులువుగా కోయొచ్చు.
31. ఫ్రిజ్ లో పెట్టిన నిమ్మకాయను ఓ పది నిమిషాలు వేడి నీటిలో ఉంచి కోయండి. రసం బాగా వస్తుంది.
32. నిలువ పచ్చళ్ళకు ఫంగస్ సోకకుండా వుండాలంటే నిలువ చేసేముందు డబ్బాలో కంది గింజంత ఇంగువని కాల్చి అందులో వేసి తీసివేయండి.
33. వెల్లుల్లిని ఎక్కువ రోజులు నిలువ చేసుకోవాలంటే వాటిని పొట్టుతీసి తడి లేకుండా కాసేపు ఎండబెట్టి ఆలివ్ నూనెలో వేసుకుని ఫ్రిజ్ లో ఉంచుకోవాలి.
34. కొన్ని రకాల కేక్ లు, బిస్కట్ల తయారీలో వాడే హేజల్ నట్స్ దొరకనప్పుడు కప్పు బాదం పలుకులు వేసుకోవచ్చు. రుచిలో తేడా వుండదు.
35. కూరగాయలు ఉడికించాక రంగు కోల్పోకుండా ఉండాలంటే నీళ్ళలో చిటికెడు పసుపు, చెంచా ఆలివ్ నూనె జోడిస్తే సరిపోతుంది.
36. మూకుడు అడుగున పదార్థాలు అంటుకుపోయి ఉంటే ఉప్పులో ముంచిన నిమ్మచెక్కతో రుద్దితే త్వరగా వదిలిపోతాయి.
37. కూరగాయలు కడిగే నీళ్ళలో నాలుగైదు చుక్కల వెనిగర్, చిటికెడు ఉప్పు కలిపితే వాటి మీద పేరుకున్న సూక్ష్మక్రిములు నశిస్తాయి.
38. బియ్యాన్ని మిక్సీ పట్టేటప్పుడు అందులో చెంచా పంచదార కలిపితే బియ్యం పిండి తెల్లగా వస్తుంది.
39. చిన్న ఇంగువ ముక్కను శుభ్రమైన వస్త్రంలో మూట కట్టి సగ్గు బియ్యం వడియాలు నిల్వ ఉంచిన డబ్బాలో ఉంచాలి. ఇలా చేస్తే, వేయించినప్పుడు మంచి వాసన వస్తాయి.
40. పకోడీలు కరకరలాడాలంటే శనగ పిండిలో చెంచా వేడి నూనె, చిటికెడు వంటసోడా కలపండి.
41. గసగసాలను వేడినీళ్ళలో నానబెట్టి రుబ్బితే మిశ్రమం మెత్తగా వస్తుంది.
42. సీసా లోపలి భాగంలో నూనె రాసి జామ్ ను ఉంచి నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
43. పాస్తాను ఉడికించే నీళ్ళలో చెంచా ఆలివ్ నూనె, చిటికెడు ఉప్పు వేస్తే ఒకదానికొకటి అతుక్కోవు.
44. కూరల వేపుళ్ళలో నూనె ఎక్కువైతే బ్రెడ్ ముక్క లేదా ఉడికించిన ఆలుగడ్డ (బంగాళా దుంప) ముక్క వేసి కాసేపైనాక తీస్తే సరిపోతుంది.
45. గ్రేవీ, సూప్ చేసేటప్పుడు నీళ్ళు ఎక్కువైతే మొక్కజొన్న పిండి చేర్చండి.
46. దోశలు మెత్తగా రావాలంటే దానిలో కొంచెం ఉడికించిన అన్నం కానీ, మరమరాలు కానీ మిక్సీలో వేసేటప్పుడు వేస్తే సరిపోతుంది.
47. బఠానీలు ఉడికించే ముందు అర చెంచా పంచదార లేదా నాలుగు చుక్కల వెనిగర్ చేర్చితే అవి రంగు మారకుండా ఉంటాయి.
48. మసాలా కూరల్లో పెరుగు లేదా మజ్జిగ వేయాలంటే పెరుగులో కొద్దిగా వరిపిండి కలిపి అప్పుడు కూరలో వేయండి.
49. టమాటా సూప్ లో కొద్దిగా బీట్ రూట్ రసం కలిపితే మంచి రంగు వస్తుంది.
50. పూర్ణం ఉండలు, పిండిలో ముంచి నూనెలో వేసే ముందు పది నిముషాలు డీప్ ఫ్రిజ్ లో ఉంచితే అవి చిట్లవు.
51. పచ్చిమిర్చి తొడిమలు తొలగించి గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి. వాటిపై కొద్దిగా పసుపు చల్లి మూతపెట్టేయాలి. ఇలా చేస్తే అవి ఎక్కువ రోజులు తాజాగా వుంటాయి.
52. కూరగాయలను అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
53. ఇడ్లీ పిండిలో నీళ్ళు ఎక్కువై పల్చగా అయితే కాస్త బొంబాయి రవ్వ వేయండి. పిండి గట్టిగా అవడమే కాకుండా రుచిగా కూడా వుంటాయి.
54. గులాబ్ జామ్ మెత్తగా రావాలంటే పిండిలో కాసిని పాలు, కొద్దిగా నెయ్యి చేర్చి కలిపితే సరిపోతుంది.
55. పెసరట్లు కరకరలాడాలంటే పెసర్లలో గుప్పెడు బియ్యం వేసి నానబెట్టి రుబ్బాలి.
56. కడిగిన బియ్యంలో బిర్యానీ ఆకు వేయండి. అన్నం ఉడికాక ఆకు తీసేస్తే అన్నం మంచి వాసన వస్తుంది.
57. పకోడీ పిండి కలిపేటప్పుడు శనగపిండితో పాటు చెంచా మొక్కజొన్న పిండి కూడా కలిపితే కరకరలాడతాయి.
58. బంగాళాదుంపలని వేయించడానికి ముందు మజ్జిగలో నానబెడితే రుచిగా ఉంటాయి.
59. నూనెలో కొద్దిగా దొడ్డుప్పు వేసి తర్వాత అప్పడాలు వేయిస్తే ఎక్కువ నూనె పీల్చుకోవు.
60. బియ్యాన్ని వేడినీటితో రెండుసార్లు కడిగితే… గంజి శాతం తగ్గుతుంది. అన్నం పొడిపొడిగా వస్తుంది.
61. పిండిలో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే దోశలు పల్చగా వస్తాయి. కరకరలాడతాయి.
62. గాలి చొరని డబ్బాలో కరివేపాకును ఉంచి అందులో కొన్ని మెంతులు వేస్తే ఆకులు ఎక్కువ రోజులు తాజాగా వుంటాయి.
63. ఉడికించిన బంగాళాదుంప ముక్కల్ని నీళ్ళ సీసాలో వేసి అటూ ఇటూ తిప్పి కడిగితే సీసా లోపల పేరుకొన్న మట్టి, దుమ్ము కణాలు బయటకు వచ్చేస్తాయి.
64. వంటసోడా, ఉప్పు సమపాళ్ళలో తీసుకొని నీళ్ళు కలపాలి. ఈ మిశ్రమాన్ని సిరా మరకల మీద రాసి పావుగంట అయ్యాక ఉతికితే దుస్తులు శుభ్రపడతాయి.
65. క్యాలీఫ్లవర్ ను ఉడికించే నీళ్ళలో కాసిని పాలు చేర్చితే రంగు మారకుండా ఉంటుంది.
66. వెల్లుల్లిని కొద్దిసేపు ఓవెన్ లో ఉంచి తీస్తే పొట్టు తీయడం సులువు అవుతుంది.
67. క్యాబేజీ వాసన నచ్చకపోతే దాన్ని ఉడికించేటప్పుడు నీళ్ళలో నాలుగు చుక్కల వెనిగర్, రెండు లవంగాలు వేస్తే సరిపోతుంది.
68. క్యాబేజీ కూర చేసేప్పుడు పైన మూత పెట్టకుండా వుంటే వాసన రాదు.
69. బెండకాయ కూర జిగురుగా వుండకూడదనుకుంటే అందులో కొన్ని టమాటాలను వేసి వండండి.
70. ఆవపిండి పొడిపొడిగా ఉండాలంటే మిక్సీ పట్టేప్పుడు ఆవాల్లో కొద్దిగా ఉప్పు వేయండి.
71. పాలపై మీగడ మందంగా పేరుకోవాలంటే గిన్నెకు మస్లిన్ వస్త్రం చుట్టి ఫ్రిజ్ లో ఉంచండి.
72. సగ్గుబియ్యం నానబెట్టి రెండు గంటల తర్వాత రుబ్బి మినప్పిండిలో కలిపితే దోశలు పల్చగా వస్తాయి.
73. బెండకాయ వేపుడు చేసేటప్పుడు ముందుగా మూకుడులో ఉప్పు, చిటికెడు పసుపు కలిపితే ముక్కలు నూనెను పీల్చుకోవు.
74. మిగిలిపోయిన కేకు ముక్కలను ఉంచిన డబ్బాలో నాలుగు ఆపిల్ ముక్కలు వేస్తే ఎక్కువ రోజులు నిల్వ వుంటాయి.
75. మూకుడు అడుగు మాడినప్పుడు అందులో నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టండి. చల్లారాక రుద్ది కడిగితే అది శుభ్రపడుతుంది.
76. ఆమ్లెట్ గుల్లగా పొంగినట్టుగా రావాలంటే కోడిగుడ్డు సొనని గిలక్కొట్టే ముందే అందులో చిటికెడు ఉప్పు వెయ్యండి.
77. చికెన్ వేయించేటప్పుడు చక్కని రంగులో రావాలంటే మొక్కజొన్న పిండికి బదులు పాలపొడిని తీసుకొని దాన్లో అద్ది వేయించాలి.
78. రెండు చెంచాల వెనిగర్ లో కాసిని వేడి నీళ్ళు, చెంచా ఉప్పు కలిపి వంటగది బల్లను శుభ్రపరచాలి. ఇలా చేస్తే వంట చేసేటప్పుడు పడిన నూనె, ఇతర ఆహార పదార్థాల వల్ల ఏర్పడిన మొండి మరకలు తొలగిపోతాయి.
79. ఆలుగడ్డ (బంగాళా దుంప), బెండకాయలతో వేపుళ్ళు చేస్తున్నప్పుడు అవి అడుగు అంటకుండా ఉండాలంటే, ముందు మూకుడును బాగా వేడిచేసి ఆ తరువాతే నూనె వేయాలి.
80. పచ్చిగా ఉన్న కాయలు త్వరగా పండాలంటే… కాగితంలో చుట్టి బియ్యం డబ్బాలో లేదా వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచితే చాలు.
81. పిండిలో చెంచా వంట సోడా కలిపితే జిలేబీ చుట్లు ఉబ్బినట్టు వస్తాయి. విరగవు కూడా.
82. పప్పులు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే నిలువ ఉంచే డబ్బాల అడుగున నాలుగు వెల్లుల్లి రేకలు వేస్తే సరి.
83. గారెలు కరకరలాడుతూ రావాలంటే వాటిని చేతితో అద్దేటప్పుడు పుల్లని మజ్జిగతో అద్దితే సరి.
84. పచ్చి బఠాణీ ఏడాది పాటూ నిల్వ ఉండాలంటే వస్త్రంలో మూటకట్టి ముందుగా వేడినీళ్ళలో మూడు నిముషాలపాటు, మరో మూడు నిమిషాలపాటు చల్లటి నీటిలో ముంచాలి. తరవాత ఎండలో బాగా ఆరబెట్టాలి. ఇప్పుడు వాటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్ లో పెట్టండి.
85. తేనెలో నాలుగు మిరియం గింజలు వేసి భద్రపరిస్తే చీమలు దరిచేరవు.
86. అగరొత్తి వెలిగించినప్పుడు రాలే బూడిదతో ఇత్తడి పాత్రలు తోమితే తళతళ లాడతాయి.
87. అరటి చిప్స్ ని వేయించేటప్పుడు ఉప్పు నీళ్ళు చిలకరించి వేయిస్తే కరకరలాడతాయి.
88. లడ్డూలని అర నిమిషం మైక్రో ఓవెన్ లో ఉంచి తీస్తే తాజాగా వుంటాయి.
89. బియ్యాన్ని నిల్వ ఉంచేటప్పుడు ఎండిన పుదీనా ఆకులని మెత్తని పొడిగా చేసి కలిపితే పురుగు పట్టకుండా చక్కని సువాసనతో ఉంటాయి.
90. ఓవెన్ ను శుభ్రపరిచేప్పుడు లోపల వంటసోడా చల్లి రాత్రంతా మూత పెట్టి ఉంచాలి. ఉదయమే ఉప్పు, నిమ్మరసం సమానంగా కలిపి దానిలో ముంచిన స్పాంజితో తుడిస్తే దుర్వాసన పోతుంది.
91. పచ్చి బఠాణీలు నిల్వ ఉండాలంటే వాటిని పాలిథీన్ సంచిలో వేసి డీప్ ఫ్రీజర్ లో ఉంచాలి.
92. పాలు కాచే పాత్రకి అడుగున కొద్దిగా నెయ్యి రాస్తే దానిని శుభ్రపరచడం తేలిక అవుతుంది.
93. మిఠాయిల తయారీకి పంచదార పొడి చేస్తుంటే, నాలుగు బియ్యం గింజల్ని కూడా కలపండి. పొడి ఉండకట్టకుండా ఉంటుంది.
94. ఆకు కూరల్ని కడిగే నీటిలో కొద్దిగా ఉప్పు లేదా వెనిగర్ కలిపితే క్రిములు తొలగిపోతాయి.
95. పసుపు నీళ్ళతో వంటింట్లో గట్టును శుభ్రం చేస్తే ఈగలు ముసురుకోవు.
96. కోడిగుడ్లు ఉడికించేప్పుడు పగలకుండా ఉండాలంటే నీళ్ళలో చిటికెడు ఉప్పు వేయండి.
97. మాంసాహారం వండేప్పుడు అందులో నాలుగు పచ్చి బొప్పాయి ముక్కలు వేస్తే త్వరగా ఉడుకుతుంది.
98. బిర్యానీ చేస్తున్నప్పుడు బియ్యం కడిగిన తరువాత కొద్దిగా నెయ్యి వేస్తే పొడిపొడిగా వస్తుంది.
99. పాలు కాచేప్పుడు గిన్నె అంచులకు నూనె రాస్తే పొంగకుండా ఉంటాయి.
100. పప్పు తొందరగా ఉడకాలంటే దానిలో చిన్న కొబ్బరి ముక్క వేయండి.
ఆహారానికి తీసుకునే ముందు 2 స్పూన్ల తేనె తీసుకుంటే..?
ఆహారం తీసుకునే ముందు రెండు స్పూన్లు తేనె తీసుకుంటూ వస్తే.. అసిడిటీకి చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూ ఆహారానికి ముందు రెండు స్పూన్ల తేనె తీసుకోవడం ద్వారా అజీర్తి సమస్యలను సైతం దూరం చేసుకోవచ్చు. బొజ్జనొప్పికి బొడ్డుచుట్టూ తేనెతో మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. ఇంకా తేనె గురించి మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..
* తేనెను పరగడుపున వేడి నీటితో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. శరీరం దృఢంగా తయారవుతుంది.
* నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే వేవిళ్లు, జలుబు తగ్గుతుంది.
* తేనెతో ఉల్లిపాయల రసాన్ని కలిపి తీసుకుంటే కంటి దృష్టి మెరుగుపడుతుంది.
* జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే, శ్వాసకోశ వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. బార్లీ గంజిని తయారు చేసుకుని దానిని వడగట్టి.. అందులో తేనె కలిపి తీసుకుంటే సరి.
* తేనెను దానిమ్మ రసంతో కలుపుకుని రోజూ తీసుకుంటే.. గుండెపోటు సమస్యలు దరిచేరవు.
* చేపనూనెతో తేనెను కలుపుకుని తీసుకుంటే.. చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* జీలకర్రను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి.. అందులో తేనె కలుపుకుని తాగితే మోకాళ్ల నొప్పిని దూరం చేసుకోవచ్చు.
గమనిక : ఇవి చిట్కాలు మాత్రమే ....